Saturday 30 July 2016

రావణుడు తన కుమారుడైన ఇంద్రజిత్తుకు తగిన జాగ్రత్తలు ఎలా తెలిపాడు ?

అశోకవనమును ధ్వంసం చేయుచు హనుమంతుడు చెప్పిన పరిచయ మరియు హెచ్చరికల సమూహ శ్లోకములు [రామాయణ జయ మంత్రం]  :

జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః |
దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః
హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః ||

న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః |
అర్ధయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీం
సమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్ |


భావము: 
మహాబలసంపన్నుడైన శ్రీరామునకు జయము. మిక్కిలి పరాక్రమశాలియైన లక్ష్మణునకు జయము. రాఘవుని ఆజ్ఞను పాలించు  కిష్కింధకు ప్రభువైన సుగ్రీవునకు జయము,అసహాయ శూరుడు,కోసల దేశ ప్రభువు ఐన శ్రీ రామ దాసుడను ,వాయు పుత్రుడను ఐన నా పేరు హనుమంతుడు.మరియు శత్రు సైన్యములను రూపు మాపు వాడను,వేయి మంది రావణులైనను యుద్ధమునెదిరించి నిలువజాలరు.వేల కొలది శిలలతోను,వౄక్షములతోను,సకల రాక్షసులను, లంకాపురిని  నాశనమొనర్చెదను.రాక్షసులందరు ఏమి చేయలేక చూచుచుందురు గాక.నేను వచ్చిన పనిని ముగించుకొని,సీతా దేవి కి నమస్కరించి వెళ్లెదను.


పై శ్లోకములు ఆణి ముత్యములవంటివి.ఇందులో హనుమంతుడు తన గురించి ఎంత గొప్పగా చెప్పాడో కదా!రామ లక్ష్మణుల పరాక్రమము,సుగ్రీవుని ప్రభువు గా చెప్పితాను రాముని దాసుడిని అన్నాడు.మరి దాసుడిని వేయి మంది రావణులే ఏమీ చేయలేకపోతె అతని రాజుని ఎదిరించగలరా? లేరు కదా! అందువల్ల ఏమి చేయాలో తెలియక రాక్షసులు నిశ్చేష్టులవుతారు అని భావము.పైగా సీతా దేవిని తీసుకుని వెళతాను అని అనలేదు,నమస్కరించి వెళతాను అన్నాడు,అంటే  తిరిగి మరల రాముని తో కలసి యుద్ధానికి వస్తానని అర్థమేమో!!!

 ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన అంశం.రాళ్లతో,వృక్షములతో యుద్ధం చేస్తాను అన్నాడు.అంటే  దగ్గరగా వున్నా(వృక్షంతో) కొడతాడు.దూరంగా వున్నా(శిలతో) కొడతాడు.

చాలా సైన్యము,గొప్ప యొధులు మరియు రావణ పుత్రుడైన అక్ష కుమారుడు హతమారిన తర్వాత రావణుడు తన కుమారునికి చెప్పిన హితోపదేశం పరికించండి.

నిహతాః కింకరాస్సర్వే జంబుమాలీ చ రాక్షసః|
అమాత్యపుత్రా వీరాశ్చ పంచసేనాగ్రయాయినః|
బలాని సుసమృద్ధాని సాశ్వ నాగ రథాని చ |
సహాదారస్తే దయితః కుమారోక్షశ్చ సూదితః|
నహి తేష్వెవ మే సారూయస్త్వయ్యదినిఘాదన|

భావము: 8000 మంది కింకరులను,జంబుమాలిని,వీరులైన అమాత్య పుత్రులు 7 గురిని,సేనానాయకులు 5 గురిని రణరంగమున చంపబడితిరి. అసంఖ్యాకముగా నున్న అశ్వములు,గజములు,రథములు,పదాతి బలములు కధన రంగమున ప్రాణములు కోల్పోయెను.నీ అనంగు తమ్ముడైన అక్ష కుమారుడు కూడ నిహతుడయ్యెను. అంత ఓ అరిమర్దనా| నాకు నీపై వున్నంత గట్టి నమ్మకము వారిపై లేదు.
 
వివరణ: ఇక్కడ చనిపోయిన వారి లెక్కను క్రోడీకరించి చెప్పి,ఇంద్రజిత్తు శక్తి పై అపార నమ్మకముందని చెపుతూ తండ్రి గా ముందు జాగ్రత్తలు రావణాసురుడు ఏ విధంగా చెప్పాడో చూడండి|

 ఇదంహి ద్రుష్త్వా నిహతం మహద్బలం
 కపేః ప్రభావం చ పరాక్రమం చ|                                    
 త్వమాత్మ నశ్చాపి సమీక్ష్య సారం
 కురుష్వ వేగం స్వబలానురూపం|

భావము: ఆ వానరుని ప్రశస్తమైన బుద్ధి కౌశలమును,శారిరక బలమును,ప్రభావమును,పరాక్రమమును దృష్టిలోనుంచుకొని,నీ బల పరాక్రమములను గూడ చూచుకొని, నీ శక్తియుక్తులకు తగినట్లుగా విజృభింపుము.

వివరణ: యీ సందర్భములో రావణుడుకు శత్రువు యొక్క శక్తియుక్తులను బేరీజు వేస్తూ తన కుమారుని శక్తిని సింహావలోకనం చేసుకొని యుద్ధం చేయమని సూచిస్తున్నారు.

 బలావమర్దస్త్వయి సన్నిక్రుష్టీ
 యధాగతే శామ్యతి శాంత శత్రౌ|
 తధా సమీక్ష్యాత్మ బలం పరం చ
 సమార భస్వాస్త్ర విదాం వరిష్థ|

భావము: అస్త్రవిదులలో శ్రేష్టుడా| నీ నిరుపమాన బల పరాక్రమములు చూచిన వెంటనే శత్రువులు లొంగిపోవుదురు.అట్టి నీవు ఆ వానరుని సమీపించినప్పుడు నీ బలమును,శత్రు బలమును సమీక్షించుకొని,మన సేనలు నశింపకుండునట్టుగా ప్రయత్నము చేయుము.

వివరణ: యిక్కడ రాజుగా స్పష్టమైన ఆదేశము యిచ్చాడు రావణుదు.అది యేమిటంటే యిక పై తమ సైన్యము  నష్ట పోకుండా శత్రు బంధనం జరగాలి.

న వీరసేనా గణశోచ్యవంతి
న వజ్ర మాదాయ విశాల సారం|
న మారుతస్యాస్య గతేః ప్రమాణం
న చాగ్ని కల్పః కరణేన హంతుం

భావము: ఓ వీరుడా| ఒకే దెబ్బతో పెక్కు మందిని హతమార్చగల ఆ వానరుని నుండి సేనలు మనలను రక్షింపజాలవు.తీక్షణమైన వజ్రాయుధము ఆయన వద్ద పనికి రాదు.ఈ వానరుని వేగము,బలము వాయువునకు లేదు.పైగా అతను అగ్నితుల్యుడు.

వివరణ: ఇక్కడ రావణుడు ఎంత అద్భుతంగా హనుమంతుని శక్తిని స్పష్టంగా గుర్తించి ఏమి చేయవద్దో కుమారునికి ఎంత చక్కగా చెప్పాడో చూడండి|

హనుమంతుడు పిడికిలి పోట్లతో,వృక్షాలతో,శిలలతో చాలా సైన్యాన్ని నష్టం చేశాడు.కాబట్టి సైన్యాన్ని తీసుకెళ్ళటం వృధా అన్నాడు.హనుమంతుడు వాయు వేగం తో  కదులుతూ శత్రువులను హతమారుస్తున్నాడు.వజ్రాయుధం తో దగ్గరికెళ్ళి కొట్టబోతే,హనుమంతుడు వాయు వేగి కనుక అది తీసుకొని తిరిగి ఇంద్ర జిత్తు నే చంప గలడు అని హెచ్చరిక.ముష్టి యుద్ధం లో ఆరి తేరిన హనుమంతుని  దగ్గరికి అదే యుద్ధ రీతిన జయించలేము కావున అందుకు ఒడికట్టవద్దు అనేది మరో హెచ్చరిక.

త్వమేవ మర్ధం ప్రసమీక్ష్య సమ్యక్
స్వ కర్మ సామ్యార్ది సమాహితాత్మా|
స్మరంశ్చ దివ్యం ధనుషోస్త్ర వీర్యం
వ్రజౌ క్షతం కర్మ సమారభస్వ|

న ఖల్వియం మతిశ్రేష్టాయత్వాం సంప్రేషయామ్యహం|
ఇయం చ రాజధర్మాణాం క్షత్రస్య చ మతిర్మతా

భావము: నీవు  శత్రువును జయించుటకై  ఏకాగ్ర చిత్తుడవై  ధనుర్విద్యకు సంబందించిన బ్రహ్మాస్త్రాది బలమును జ్ఞప్తికి తెచ్చుకొనుచు వెళ్ళుము.బ్రహ్మాస్త్రమును స్మరించుచు వెళ్ళుము.దానికి తప్ప మరి దేనికి అతను లొంగడు.

బాలుడైన నిన్ను యుద్ధమునకు పంపుట ఉచితముగా లేకున్నా,క్షాత్రధర్మముననుసరించి ఇట్లు చేయుటే యుక్తము. ఏలనన సమర్ధులైన యోధులుండగా రాజు స్వయంగా వెళ్ళుట రాజ ధర్మవిరుద్ధము.

Tuesday 26 July 2016

Age of Rama during Yajna Samrakshan and at the time of War with Ravana

విశ్వామిత్రుడు శ్రీరాముని యజ్ఞసంరక్షణకు పంపుమని అడుగగా, దశరధుడు పలికిన శ్లోకములో రాముని 16 సం||ల  లోపు వయస్సు కలవాడుగ వర్ణించెను.

 ఊన షొడశవర్షో మే రామో రాజీవలోచనః |
 న యుద్ధ యొగ్యతామస్య పశ్యామి సహరాక్షసైః |

భావము: రాజీవలోచనుడైన నా రాముడు పదునారేండ్ల వయస్సు కూడా నిండని వాడు.కనుక ఇతడు చిఱుతప్రాయమున ఆ క్రూర రాక్షసులతొ యుద్ధము చేయగలడని నేను అనుకొనను.

యజ్ఞసంరక్షణ సమయమున రామలక్ష్మణుల రూపములను వర్ణించు శ్లోకము.

విశ్వామిత్రో యయావగ్రే తతో రామోదనుర్ధరః |
కాకపక్షధరో ధన్వీ తంచ సౌమిత్రి రన్వగాత్ ||

కలపినౌ ధనుష్పాణీ  శోభయనౌ దిశో దవే |
విశ్వామిత్రం మహాత్మానం త్రిశీర్షవివ పన్నగౌ ||

భావము:
విశ్వామిత్రుడు ముందుకు సాగిపొవుచుండగ జులపాలజుట్టుగల శ్రీరాముడు ధనుర్ధారియై అయనను అనుసరించెను. లక్ష్మణుడు ధనువును చేబట్టి రాముని వెంట నడిచెను.

ఆ రామలక్ష్మణులు అమ్ముల పొదులను, ధనస్సులను ధరించి, తమ తమ శోభలతొ అన్ని దిక్కులకు వెలుగులను విరజిమ్ము చుండిరి. అటునిటు తూణీరములను, ధనస్సును దాల్చి వారు మూడు తలల పాము వలె భాసిల్లుచుండిరి.

దీనినిబట్టి యజ్ఞసంరక్షణ సమయమునకు రాములవారు జులపాలజుట్టుగలవాడు, రాజీవలోచనుడు, 16 సం|| లొపు వయస్సు కలవాడూ అని తెలుసుకోవలెను.


ఆశోకవనములో హనుమంతునితో సంభాషించు సమయమున సీతమ్మ తల్లి , తమ పెళ్ళి తర్వత 12 సం||లు అయోధ్య అంతఃపురములో గడిపినట్లుగా  తెలిపినది.

సమా ద్వాదశ తత్రాహం రాఘవశ్య వివేశనే |
భుంజానా మానుషాన్ భోగాన్ సర్వకామసమృద్ధినీ ||

భావము: నేను అయోధ్యలొ శ్రీరాముని అంతఃపురమున ఏ లోటు లేనిదాననై, సమస్త మానవ భోగములను అనుభవించుచు 12సం||లు గడిపితిని.

దీనినిబట్టి వివహసమయానికి శ్రీరాముని వయస్సు 16సం||లు , అరణ్యవాసము  మొదలయ్యెనాటికి 28 సం||లు , అరణ్యవాసం చివరలో యుద్ధం జరిగింది కావున, 28కి 14 కలిపితే 42సం||లు; అంటే శ్రీరాములవారి వయస్సు రావణునితో యుద్ధ సమయనికి సుమారుగ  42సం||లు అని తెలుస్తోంది.